AP News | తిరుమలలో శ్రీవాణి ట్రస్టు రద్దు
AP News | తిరుమలలో శ్రీవాణి ట్రస్టు రద్దు
రెండు లేదా మూడు గంటల్లోన్లే సామాన్య భక్తులకు దర్శనం
టీటీడీలో పని చేస్తున్న అన్యమతస్తులను ఇతర శాఖలకు బదలాయింపు
టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
Hyderabad : ఆంధ్రప్రదేశ్‌లోని Tirumala Tirupati Devastanam (TTD) పాలక మండలి పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. శ్రీవాణి ట్రస్టును రద్దు చేసింది. ఈ మేరకు టీటీడీ బోర్డు కీలక ప్రకటన జారీ చేసింది. సామాన్య భక్తులకు రెండు, మూడు గంటల్లోనే దర్శనం కల్పించే విధంగా మార్పులకు శ్రీకారం చుట్టింది. తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భక్తులు వేచి ఉండే గదులలో ఇబ్బందులు పడకుండా త్వరితగతిన స్వామివారి దర్శనం కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించింది. టీటీడీలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను వీఆర్ఎస్ లేదా ప్రభుత్వ శాఖల్లోకి బదిలీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం టీటీడీ ఛైర్మన్ బి ఆర్ నాయుడు ప్రకటన జారీ చేశారు.
అన్నదానంలో నూతనంగా మరో ఐటమ్‌ని భక్తులకు వడ్డించాలని బోర్డు నిర్ణయించింది. శ్రీవారి ప్రసాదాల్లో నాణ్యమైన నెయ్యి వినియోగించేందుకు కమిటీ ఏర్పాటుకు తీర్మానించింది. టీటీడీ ఉద్యోగులకు ఇస్తున్న బ్రహ్మోత్సవ బహుమానాన్ని రూ.14 వేల నుంచి రూ.15,400లకు పెంచింది. ఆ మేరకు బోర్డు ఆదేశాలు కూడా జారీ చేసింది. గత వైసీపీ హయాంలో శారద పీఠానికి కేటాయించిన భూములు రద్దు చేసింది. ఆ స్థలంలో పీఠం నిర్మించిన బిల్డింగ్‌ని కూల్చివేయాలని నిర్ణయం తీసుకుంది. అలాగే టూరిజం శాఖకు కేటాయిస్తున్న 4 వేల ఎస్ఈడీ టిక్కెట్లు రద్దు చేస్తూ ఛైర్మన్ ఆధ్వర్యంలో టీటీడీ బోర్డు కీలక పలు నిర్ణయాలు తీసుకున్నారు.
తిరుమలలోని డంపింగ్ యార్డులోని చెత్తను మూడు నెలల్లో క్లియర్ చేయాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. శ్రీనివాససేతు పేరుని గరుడ వారధిగా మార్పు చేస్తున్నట్లు ప్రకటించింది. అలిపిరిలో దేవలోక్‌కు కేటాయించిన 20 ఎకరాల భూమిని టీటీడీకి అప్పగించే విధంగా ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించింది. అలాగే తిరుమల పరిసర ప్రాంతాల్లో రాజకీయాలు మాట్లాడడంపై నిషేధం విధించారు. ఈ నిబంధనలు అతిక్రమిస్తే కేసులు పెడుతామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. స్థానికులకు ప్రతి నెలా మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం కల్పించేలా టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. శ్రీవాణి ట్రస్టును రద్దు చేస్తూ టికెట్ల విక్రయం ద్వారా వచ్చే సొమ్ముని టీటీడీ అకౌంట్‌లోనే జమ అయ్యేలా నిర్ణయం తీసుకుంది. స్వామివారికి చెందిన నగదును ప్రైవేట్ బ్యాంకులో డిపాజిట్లు నుంచి ప్రభుత్వ బ్యాంకుల్లో జమ చేయాలని నిర్ణయించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన టూరిజం కార్పోరేషన్లు, ఏపీఎస్ ఆర్టీసీ (APSRTC), టీఎస్ ఆర్టీసీ (TGRTC)లకు టీటీడీ కేటాయించిన శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300/-) టికెట్లకు సంబంధించి అవకతవకలు జరిగాయని ఫిర్యాదులు వచ్చాయని, వాటిని పరిశీలించిన తర్వాత ఆ సంస్థలకు కోటాను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
* * *
Leave A Comment